న్యూఢిల్లీ, ఆగస్టు 24: కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. అక్రమ ఆస్తుల వ్యవహారంపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ ముగించి పూర్తిస్థాయి విచారణ చేపట్టినప్పటి నుంచి ఆత్మరక్షణలోపడి దర్యాప్తుపై స్టేను కోరుతూ జగన్ దాఖలు చేసిన పటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తులు దల్వీర్ భండారీ, దీపక్‌వర్మతో కూడుకున్న ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. సీబీఐ సోదాలను నిలుపుచేయవలసిందిగా కోరుతూ జగన్ దాఖలు చేసిన రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేయటంతో జగన్ భవితవ్యంపై ఉత్కంఠత చోటుచేసుకుంటోంది. జగన్ దాఖలు చేసిన రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లపై బుధవారం విచారణ జరిగింది. ప్రముఖ న్యాయవాదులు రామ్‌జెఠ్మాలానీ, ముకుల్ రోహతగి, కెటితులసీ జగన్ పక్షాన వాదించారు. సుమారు రెండు గంటల పాటు వాదోప వాదాలు జరిగాయి. న్యాయానికి విరుద్ధంగా హైకోర్టు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిందని జగన్ న్యాయవాదులు ఆరోపించారు. ప్రాథమిక విచారణలో బయటపడిన విషయాలను సీబీఐ సీల్డు కవర్‌లో కోర్టుకు అందచేసింది. ఈనివేదిక ప్రతిని ప్రతివాదులకు ఇవ్వలేదని ప్రాథమిక నివేదికలో అంశాలు తెలియకుండానే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించటం అన్యాయమేనని వారు వాదించారు. కాగా ప్రతి విషయానికి సాక్ష్యాలున్నాయని ధర్మాసనం వెల్లడించింది. క్రిమినల్ కేసులపై ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతించరాదని గతంలో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా జగన్ ప్రత్యర్థులు పిటిషన్లు దాఖలు చేయడం, దానిపై సిబిఐ విచారణ చేపట్టడం సహజ న్యాయానికి విరుద్ధమని వీరు వాదించారు. ప్రాథమిక విచారణలో బయట పడిన అంశాల తీవ్రతను పరిగణనలోకి తీసుకునే హైకోర్టు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిందని ధర్మాసనం స్పష్టం చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్లను తిరస్కరించినప్పటికీ జగన్ చట్టపరమైన పంథాలో విచారణకు సహకరించాలని కోర్టు సూచించింది. చట్టం పరిధిలో జగన్ తన ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చునని సూచించింది. సుప్రీంకోర్టు స్టే విధించడానికి నిరాకరించడంతో జగన్ భవిష్యత్ ఎలా మారుతుందోనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కంటె పూర్తి స్థాయి విచారణలో మరిన్ని విషయాలు బయటపడుతుండడంతో ఆయన కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారి భవితవ్యం కూడాప్రశ్నార్ధకంగా మారుతోంది. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పునే సమర్థించటంతో సీబీఐ అరెస్టులు మొదలుపెడితే జగన్‌తో సహా అనేకమంది జైలుకు వెళ్లక తప్పదని న్యాయనిపుణులు చెబుతున్నారు. జగన్ ముందస్తు బెయిల్‌కు ప్రయత్నించినా ఫలితం ఉండకపోవచ్చునని అంటున్నారు.
- Recent Posts
- Comments
Advertisement