బిగుస్తున్న ఉచ్చు!
కంపెనీలకు ఇక నేరుగా నోటీసులు * జగన్ సహా వరుస * అరెస్టులకు సన్నాహాలు * బిపి ఆచార్యను విచారిస్తున్న * సిబిఐ అధికారులు * కంపెనీల అకౌంట్ల స్తంభన
హైదరాబాద్, ఆగస్టు 24: వైఎస్ జగన్ కంపెనీలు, ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పలు ఇతర కంపెనీలు, ఎమ్మార్, ఎంజిఎఫ్ కంపెనీలపై నమోదైన కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు వీలు లేకుండా ఉచ్చు బిగించేందుకు సిబిఐ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. సోదాల ప్రక్రియ పూర్తి చేసిన సిబిఐ ఇక ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతోంది. ఇక అసలు ఘట్టం ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. ఈ కేసులన్నీ కీలక దశకు చేరుకోబోతున్నాయి. కేసుల్లో ఉన్న కంపెనీల యాజమాన్యాలనే నేరుగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కోరుతూ సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేయబోతున్నారు. వారందరిని పిలిచి విచారించిన తర్వాత జగన్‌తో సహా అందరిని వరుసగా అరెస్ట్‌లు చేసేందుకు సిబిఐ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ టీం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన పూర్తి డాక్యుమెంటరీ సాక్ష్యాలను సిద్ధం చేసింది. కోర్టు అనుమతితో వీరందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ పని జరుగుతుందని ముందునుంచే గ్రహించిన ఆయా కంపెనీల యాజమాన్యాలు ముందస్తుగా బెయిల్ పొందేందుకు ఎవరి ఏర్పాట్లలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య నుంచి ఇప్పటికే పూర్తి వివరాలు సేకరించారు. ఎమ్మార్‌కు భూములు కేటాయించడంలో నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం చేకూర్చినట్లు సిబిఐ అన్ని రకాల సాక్ష్యాలను సేకరించడంతో ఆచార్యను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తగిన అనుమతి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. బిపి ఆచార్యను రెండు రోజులుగా సిబిఐ అధికారుల బృందం ఒక రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కంపెనీల వారీగా, కేసుల వారీగా విచారణ పూర్తి చేసేందుకు ప్రత్యేక బృందాలను సిబిఐ జాయింట్ డైరక్టర్ ఏర్పాట్లు చేశారు. జగన్ కంపెనీలకు చెందిన ఆడిటర్ వరదరాజులను బుధవారం సిబిఐ విచారించినట్లు తెలిసింది. గత రెండు మూడు రోజులుగా దిల్‌కుషా అతిధి గృహంలో సిబిఐ బృందాలు కంపెనీల్లో సోదాల సందర్భంగా సీజ్ చేసిన డాక్యుమెంట్లను అధ్యయనం చేస్తోంది. వాటన్నింటిని క్రోడీకరించి కంప్యూటరీకరిస్తున్నారు. అన్ని కీలక ఫైళ్ళను సాఫ్ట్‌కాపీల రూపంలో తమ వద్ద భద్రపర్చుకుంటున్నారు. దీని ద్వారా సాక్ష్యాలు తారు మారుకాకుండా ముందే అడ్డుకట్ట వేసేందుకు సిబిఐ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నిందితులుగా ఉన్న ఆయా కంపెనీలు, యాజమాన్యాలకు సంబంధించిన బ్యాంకు అక్కౌంట్లు అన్నీ స్తంభింప చేశారు. ముఖ్యంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారు, షేర్లు కొన్నవారు తీవ్ర అందోళన చెందుతున్నారు. షేర్ మార్కెట్‌లో ఆ కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టడంతో భవిష్యత్ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. సిబిఐ బారి నుంచి తప్పించుకునే ఏకైక ఆశగా మిగిలిన సుప్రీంకోర్టు తీర్పు కూడా వ్యతిరేకంగా రావడంతో జగన్ కేసు మరింత బిగుసుకునే అవకాశం ఉంది. సిబిఐ ఇప్పటి వరకు సాదాసీదాగా చేస్తున్న విచారణను సుప్రీం తీర్పు నేపధ్యంలో మరింత ముమ్మరం చేసేందుకు సన్నద్ధమవుతోంది. దీంతో రాబోయే రెండు మూడు రోజుల్లో సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.