అన్నా బిల్లుకు సర్కార్ ససేమిరా

పాత బిల్లు స్థానంలో పటిష్టమైన కొత్త బిల్లు అన్నా బృందానికి కేంద్రం స్పష్టీకరణ * పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని కాపాడాలి * సర్కారుకు ప్రతిపక్షాల సూచన * దీక్ష విరమించాలని హజారేకు విజ్ఞప్తి * తిరస్కరించిన హజారే

న్యూఢిల్లీ, ఆగస్టు 24: పార్లమెంటు సౌర్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవాలని అఖిలపక్షం స్పష్టం చేయటంతో బలం పుంజుకున్న యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం తొమ్మిది రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్న పౌరసమాజం నాయకుడు అన్నా హజారే డిమాండ్ చేస్తున్న జనలోకపాల్ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించే విషయంలో మరోసారి మొండికేసింది. జన లోక్‌పాల్ బిల్లుకు బదులు సవరించిన కొత్త లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తామని ప్రభుత్వం కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. పార్లమెంటు ఆధిక్యతన నిలబెట్టుకోవాలని అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు సూచించటంతోపాటు ఈ విషయంలో ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించినట్లు తెలిసింది. ప్రతిపక్షాలు చేసిన సూచనన మేరకు ప్రభుత్వం మధ్యేమార్గంగా సవరించిన కొత్త లోక్‌పాల్ బిల్లును రూపొందించి లోక్‌సభలో ప్రతిపాదించే అవకాశాలున్నాయి. జన లోక్‌పాల్ బిల్లు, ప్రభుత్వం ఈ నెల నాలుగో తేదీ ప్రతిపాదించిన లోక్‌పాల్ బిల్లుకు బదులు ఇప్పుడు సవరించిన లోక్‌పాల్ బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించే దిశగా పావులు కదులుతున్నాయి. లోక్‌సభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి అన్నా హజారే ప్రతినిధులు అరవింద్ కేజ్రివాల్, కిరణ్‌బేడి, ప్రశాంత్ భూషణ్‌తో మధ్యే మార్గం గురించి చర్చలు జరిపారు. కొత్త లోక్‌పాల్ బిల్లును లోక్‌సభలో ప్రతిపాదిస్తామని ప్రణబ్ ముఖర్జీ వారితో చెప్పారని అంటున్నారు. లోక్‌పాల్ బిల్లు పరిధిలోకి ప్రధాన మంత్రిని, కింది స్థాయి ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకురావటంతోపాటు సిబిఐలోని ఒక దర్యాప్తు విభాగాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రణబ్ ముఖర్జీ వారితో చెప్పారు. అయితే ఈ నెల 30 లోగా లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. ఈ నెల నాలుగున లోక్‌సభలో ప్రతిపాదించిన లోక్‌పాల్ బిల్లును ఉపసంహరించుకోకుండా కొత్తగా తయారు చేసే బిల్లును ప్రభుత్వం ఎలా ప్రతిపాదిస్తుందనేది స్పష్టం కావటం లేదు. జన లోక్‌పాల్ బిల్లు, ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లుకు బదులు పటిష్ఠమైన మూడో లోక్‌పాల్ బిల్లును తయారు చేసి పార్లమెంటులో ప్రతిపాదించాలని బిజెపి, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు అఖిల పక్ష సమావేశంలో డిమాండ్ చేశాయి. ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపాదించిన లోక్‌పాల్ బిల్లును ఉపసంహరించుకుని జనలోక్‌పాల్ బిల్లును దృష్టిలోపెట్టుకుని మరో పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును తయారు చేసి పార్లమెంటులో ప్రతిపాదించాలని సూచించినట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి వెల్లడించారు.

పటిష్ఠమైన కొత్త లోక్‌పాల్ బిల్లు వస్తున్నందున నిరాహార దీక్షను విరమించుకోవాలని అన్నా హజారేకు అఖిలపక్షం పిలుపు ఇచ్చింది. అయితే అన్నా హజారే ఈ పిలుపును తిరస్కరించారు. జన లోక్‌పాల్ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రతిపాదిస్తే అన్నా హజారే ఆ వెంటనే నిరాహార దీక్షను విరమించుకుంటారని పౌర సమాజం నాయకుడు అరవింద్ కేజ్రివాల్ రాంలీలా మైదానంలో బుధవారం సాయంత్రం ప్రకటించారు.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన బుధవారం మూడు గంటల పాటు సమావేశమైన అఖిల పక్ష సమావేశంలో అన్నా హజారే నిరాహర దీక్ష మూలంగా ఉత్పన్నమైన పరిస్థితి, జనలోక్‌పాల్ బిల్లు తదితర డిమాండ్ల గురించి లోతుగా చర్చలు జరిపారు. పార్లమెంటు ఆధిక్యతను దెబ్బ తీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అదుపు చేయాలని పలువురు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం లోక్‌సభలో ప్రతిపాదించిన లోకపాల్ బిల్లు ఆశించిన విధంగా లేదని, అదే విధంగా అన్నా హజారే బృందం తయారు చేసిన జన లోక్‌పాల్ బిల్లు కూడా తమకు ఆమోదం కాదని మెజారిటీ రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లు, జన లోక్‌పాల్ బిల్లుకు బదులు కొత్తగా పటిష్ఠమైన బిల్లును తయారు చేసి లోక్‌సభలో ప్రతిపాదించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచించాయి. పార్లమెంటు ద్వారానే పటిష్ఠమైన లోక్‌పాల్ చట్టం ఏర్పాటు కావాలి తప్ప బైటివారి ఆదేశాల మేరకు లోక్‌పాల్ చట్టం ఏర్పాటు కాకూడదని ప్రభుత్వానిక రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయని అంటున్నారు.

Tags:

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.