పార్టీకీ గుడ్‌బై !



జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలు నేడు ఎంపీలు సహా జాబితాలో 31మంది.. సంఖ్య మరింత పెరిగే అవకాశం

హైదరాబాద్, ఆగస్టు 21: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై అవినీతి ముద్రవేసి బురద చల్లేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌కు మద్దతిస్తున్న 29మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తమ పదవులకు, కాంగ్రెస్ పార్టీకి సోమవారం రాజీనామా చేయనున్నారు. ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి ఇరవై ఐదుమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి హాజరుకాలేని మరో నలుగురు ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యుడు సబ్బం హరి కూడా రాజీనామాలు చేయనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు టెలిఫోన్లో తెలియజేశారు. రాజీనామాలు చేసే ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. జగన్‌కు సన్నిహితులైన ఎమ్మెల్యేల పేర్లు ఈ జాబితాలో లేవు. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పి రామచంద్రారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాహజాన్ వంటి మరికొందరు జాబితాలో లేరు. అటువంటి వారు కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా జగన్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలకు తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యలో పంజగుట్టలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు. ఆదివారం జరిగిన సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించారు. జగన్ ఆస్తుల కేసు విషయంలో సిబిఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుట్ర పన్నినట్టు పేర్కొనడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన ఇరవై ఐదుమంది ఎమ్మెల్యేలు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామాలు చేయాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామాలు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. సమావేశంలో జగన్ మద్దతుదారులైన ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చినపుడు వారు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. సమావేశానికి హాజరైన లోక్‌సభ సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి కూడా రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. తామిద్దరమే కాకుండా మూడో ఎంపీ కూడా ఒకరున్నారని మీడియాతో మాట్లాడుతూ సబ్బం హరి చెప్పారు.

గవర్నర్‌తో భేటీ రద్దు

జగన్‌పై జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపుచర్యల గురించి ఫిర్యాదు చేసేందుకు జగన్ వర్గం ఎమ్మెల్యేలు రెండు రోజుల కిందట గవర్నర్ అప్పాయింట్‌మెంట్ కోరారు. సోమవారం సమయం ఇవ్వనున్నట్టు రాజ్‌భవన్ వర్గాలు వారికి తెలియజేశాయి. అయితే తాజాగా శాసన సభ్యత్వాలకే రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక గవర్నర్‌ను కలవడం ఎందుకని అభిప్రాయపడ్డారు.

కక్ష సాధింపువల్లే రాజీనామాలు

ఇలాఉండగా, సమావేశం అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ జగన్ మీద ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఈరోజు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌పై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా తమ పదవులకు రాజీనామాలు చేయడంతో పాటు, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామాలు చేయనున్నట్టు వివరించారు. సోమవారం ఉదయం స్పీకర్‌ను లేదా శాసనసభ కార్యదర్శిని కలిసి రాజీనామా పత్రాలను అందజేయనున్నారు.

రాజీనామాలు చేయనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

1 సబ్బం హరి (అనకాపల్లి)

2 మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి (నెల్లూరు)

-----------

1 పిల్లి సుభాష్ చంద్రబోస్ (రామచంద్రాపురం)

2 బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)

3 కొండా సురేఖ (పరకాల),

4 శోభా నాగిరెడ్డి (ఆళ్ళగడ్డ)

5 జి శ్రీకాంతరెడ్డి (రాయచోటి)

6 ఎ అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట)

7 కె శ్రీనివాసులు (కోడూరు)

8 మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి)

9 సి ఆదినారాయణరెడ్డి (జమ్మల మడుగు)

10 బి గుర్నాధరెడ్డి (అనంతపురం)

11 కె రామచంద్రారెడ్డి (రాయదుర్గం)

12 కె రాంభూపాల్‌రెడ్డి (పాణ్యం)

13 బి శివప్రసాద్‌రెడ్డి (దర్శి)

14 టి బాలరాజు (పోలవరం)

15 డి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ)

16 ఎన్ శేషారెడ్డి (అనపర్తి)

17 ఎం ప్రసాదరాజు (నర్సాపురం)

18 ధర్మాన కృష్ణదాస్ (నర్సన్నపేట)

19 జి బాబూరావు (పాయకరావుపేట)

20 కె భారతి (టెక్కలి)

21 పూతలపట్టు రవి (పూతలపట్టు)

22 కె సత్యవతి (్భద్రాచలం)

23 జయసుధ (సికింద్రాబాద్)

24 నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (కోవూరు)

25 బాలనాగిరెడ్డి (మంత్రాలయం)

26 పి రామకృష్ణారెడ్డి (మాచర్ల)

27 కె చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు)

28 ఆళ్ళ నాని (ఏలూరు)

29 సుచరితారెడ్డి (ప్రత్తిపాడు)

==============

25 తర్వాతే స్పీకర్ నిర్ణయం

హైదరాబాద్, ఆగస్టు 21: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డి వర్గానికి చెందిన 29మంది ఎమ్మెల్యేలు సోమవారం చేయనున్న రాజీనామాలపై ఈనెల 25 తర్వాతే శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న స్పీకర్ 25న నగరానికి రానున్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలు పరిశీలించాకే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను తిరస్కరించినట్టుగా జగన్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలు తిరస్కరించడం సాధ్యం కాకపోవచ్చని స్పీకర్ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. శాసన సభ్యత్వాలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సైతం జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నందున వాటిని ఆమోదించక తప్పదని అంటున్నారు. ఒక పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసినట్లయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం తమ శాసన సభ్యత్వాలకు అనర్హులవుతారు. అలాంటిది పార్టీకి, శాసన సభ్యత్వాలకు కూడా జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయనున్నందున వారి రాజీనామాలను ఆమోదించక తప్పదన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

Tags:

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.