అడ్డుకునే యత్నంలో హైకమాండ్



ఆమోదాన్ని నిరాకరించే అంశాలపై దృష్టి రాహుల్‌తో సీనియర్ల మంతనాలు రాజకీయ పరిణామాలపై నిశిత పరిశీలన

న్యూఢిల్లీ, ఆగస్టు 21: రాష్ట్ర కాంగ్రెస్‌లోని జగన్మోహన్ రెడ్డి వర్గం రాజీనామాలకు నిర్ణయించడంతో తదుపరి రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికిన దాదాపు 29మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని నిర్ణయించారు. జగన్‌కు మద్దతిస్తున్న 27 మంది కాంగ్రెస్, ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు సోమవారం రాజీనామాలు సమర్పిస్తే, తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీ అధినేత్రి సోనియా అమెరికాలో ఉండటంతో, పార్టీ వ్యవహారాలను చూస్తున్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, పార్టీ వ్యవహారాల తాత్కాలిక బాధ్యతను నిర్వహిస్తున్న సీనియర్ నాయకులు, రక్షణ మంత్రి ఏకె ఆంటోని, జనార్దన్ ద్వివేది, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన 27మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలనుకోవటం గురించి రాహుల్‌గాంధీ, మిగిలిన ముగ్గురు సీనియర్లతో చర్చలు జరిపినట్టు ఏఐసిసి వర్గాలు వెల్లడించాయి. జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ముంచుకొచ్చే ముప్పుపై సమీక్షలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ సర్కారును కాపాడుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరుగుతున్నాయి. గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ ఎప్పటికప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. జగన్ వర్గం ఎమ్మెల్యేల చర్య కారణంగా కిరణ్ సర్కారుకు ఎలాంటి ప్రమాదం లేకున్నా, వీరి మాదిరిగానే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ప్రత్యేక రాష్ట్రం కోసం మరోసారి రాజీనామాలు సమర్పిస్తారా? తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రెండోసారి రాజీనామాలకు సిద్ధపడితే ఏం చేయాలి? అనే అంశాలపై పార్టీ సీనియర్లు దృష్టి పెట్టారు. గతంలో తెలంగాణకు చెందిన వివిధ పార్టీల ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించినట్టే జగన్ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించటం సాధ్యం కాకపోవచ్చని, కాంగ్రెస్ పార్టీకి కూడా వారు రాజీనామాలు చేయాలని నిర్ణయించడమే దీనికి కారణమని భావిస్తున్నారు. జగన్‌వర్గం శాసన సభ్యులతో పాటు తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో రెండోసారి రాజీనామాలకు దిగితే మాత్రం కిరణ్ సర్కారు, కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడకతప్పదని హైకమాండ్ ఆందోళన చెందుతుంది.

Tags:

About author

Curabitur at est vel odio aliquam fermentum in vel tortor. Aliquam eget laoreet metus. Quisque auctor dolor fermentum nisi imperdiet vel placerat purus convallis.