నేడు లోక్‌సభకు జనలోక్‌పాల్ వెంటనే స్థారుూసంఘం ముందుకు 30లోగానే ఆమోదానికి డిమాండ్ హజారేకు లేఖలో ప్రధాని హామీ నేడు మరోసారి చర్చించే అవకాశం క్షీణిస్తున్న అన్నా ఆరోగ్యంపై ఆందోళన తొలుత ప్రధానితో రాహుల్ భేటీ రంగంలోకి ‘ట్రబుల్ షూటర్’ ప్రణబ్ సోనియాకు పరిస్థితి వివరించిన మన్మోహన్ టీం హజారేతో విస్తృత చర్చలు నేడు అఖిలపక్ష సమావేశం లిఖితపూర్వక హామీ కోరిన బృందం అన్నా దీక్షకు నేడు తెర?
న్యూఢిల్లీ, ఆగస్టు 23: పౌరసమాజం కార్యకర్త అన్నా హజారే దీక్షకు దేశం నలుమూలల నుంచీ పెద్దఎత్తున మద్దతు లభించటంతో యుపిఏ సంకీర్ణ సర్కారు దిగిరాక తప్పలేదు. పటిష్టమైన లోకపాల్ బిల్లు రూపొందించేందుకు అన్నా హజారే బృందంతో ప్రభుత్వం ప్రత్యక్ష చర్చలు ప్రారంభించనుంది. ప్రభుత్వం ఇప్పటికే లోక్‌సభలో ప్రతిపాదించిన లోక్‌పాల్ బిల్లును ఉపసంహరించుకుని, జనలోక్‌పాల్ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రతిపాదించాలని అన్నాహజారే బృందం డిమాండ్ చేసింది. అలాగే, జనలోక్‌పాల్ బిల్లును ఆగస్టు 30లోగా ఆమోదించాలని కూడా హజారే బృందం స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం ప్రభుత్వ లోక్‌పాల్ బిల్లు ఉపసంహరణకు అంగీకరించటం లేదు. దీనికి బదులు జనలోక్‌పాల్ బిల్లును సైతం లోక్‌సభలో ప్రతిపాదించి, అనంతరం పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపి వీలైనంత త్వరగా తెప్పించేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం చెబుతోంది. జనలోక్‌పాల్ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రతిపాదించిన వెంటనే, అన్నా హజారే నిరాహార దీక్ష విరమించుకోవాలని ప్రణబ్ ముఖర్జీ సూచించినట్టు చెబుతున్నారు. మన్మోహన్ సింగ్ బుధవారం సాయంత్రం తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ప్రారంభమయ్యేలోగా అన్నా నిరాహార దీక్షకు తెరదించాలని సంకీర్ణ సర్కారు ప్రయత్నిస్తోంది. అన్నా హజారే ఎనిమిది రోజుల నిరాహార దీక్ష మూలంగా దేశంలో ఉత్పన్నమైన పరిస్థితిపై చర్చించేందుకు మన్మోహన్ సింగ్ బుధవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం అన్నా హాజరేకు రాసిన లేఖలో జనలోక్‌పాల్ బిల్లును పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపించే ప్రతిపాదన చేశారు. నిరాహార దీక్షను విరమించాల్సిందిగా అన్నాకు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని రంగంలోకి దించిన ప్రధాని, ఆయన ద్వారా అన్నా హజారే సహచరులతో చర్చలు ప్రారంభించారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మంగళవారం మధ్యాహ్నం మన్మోహన్ సింగ్‌తో సమావేశమై అన్నా హజారే నిరాహార దీక్ష మూలంగా ఉత్పన్నమైన పరిస్థితిని సమీక్షించారు. అనంతరం పార్టీ, ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాన్ని తయారు చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆమెరికాలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అన్నా హజారే నిరాహార దీక్ష మూలంగా ఉత్పన్నమైన పరిస్థితి, యుపిఏ సంకీర్ణ సర్కారు తీసుకుంటున్న చర్యల గురించి మన్మోహన్ వివరించినట్టు తెలిసింది. మన్మోహన్ సింగ్ ఆ తరువాత సీనియర్ నాయకులు, మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకె ఆంటోని, పి చిదంబరంతో సంప్రదింపులు జరిపారు. వ్యూహం ప్రకారమే అన్నా హజారేకు మన్మోహన్ సింగ్ లేఖ రాశారని చెబుతున్నారు. అన్నా హజారేకు అత్యంత సన్నిహితులైన అరవింద్ కేజ్రివాల్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మాజీ ఐపిఎస్ అధికారి కిరణ్‌బేడి మంగళవారం సాయంత్రం ప్రణబ్ ముఖర్జీతో చర్చలు ప్రారంభించారు. ప్రణబ్ ముఖర్జీ నార్త్‌బ్లాక్ కార్యాలయంలో చర్చలు జరిగాయి. టీం హజారే బృందం డిమాండ్లను విన్న ప్రణబ్, బుధవారం వరకూ ఆగాలని, అప్పటిలోగా ప్రధానితో చర్చిస్తానని తెలిపారు. అన్నా హజారే ఆరోగ్యం తమకు ముఖ్యమని, ఆయన తక్షణమే దీక్ష విరమించాలని కోరారు. బుధవారంలోగా లోక్‌పాల్ అంశానికి పరిష్కారం రాగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. భేటీలో న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా హాజరు కావటం గమనార్హం. అన్నా హజారే బృందంతో ప్రణబ్ ముఖర్జీ జరిపిన చర్చలను రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమీక్షించింది. రాత్రి పొద్దుపొయిన తరువాత ప్రధాని అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన కమిటీ పరిస్థితిపై సమాలోచనలు జరిపింది. దీంతో సమస్య పరిష్కారం దిశగా పరిస్థితి కొనసాగుతుంది. అన్నీ సవ్యంగా సాగితే బుధవారం సాయంత్రం లోగా అన్నా అనుకున్నట్టుగానే పరిష్కారం లభించే సూచనలు ఉన్నాయి. అంతకుముందు అరవింద్ కేజ్రివాల్ కేంద్ర న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో ఒక సీనియర్ అధికారి నివాసంలో సమావేశమై సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమారుడు, లోక్‌సభ సభ్యుడు సందీప్ దీక్షిత్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.
హజారేకు ప్రధాని లేఖ
జనలోక్‌పాల్ బిల్లును పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించే విషయం పరిశీలిస్తామని ప్రధాన డాక్టర్ మన్మోహన్ సింగ్ పౌరసమాజం నాయకుడు అన్నా హజారేకు హామీ ఇచ్చారు. అన్నాహజారే ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, నిరాహార దీక్షను విరమించాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. అవినీతిని అరికట్టే విషయంలో మీరు వ్యక్తం చేస్తున్న ఆందోళనతో ఏకీభవిస్తున్నానని అన్నా హాజరేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘అవినీతిని పూర్తిగా రూపుమాపటం లేదా గణనీయంగా తగ్గించాలనే విషయంలో ఎవరికీ భేదాభిప్రాయాలు లేవు. అయితే ఈ లక్ష్య సాధన కోసం భిన్నమార్గాలను ఆచరించాల్సి వస్తోంది’ అని పేర్కొన్నారు. అవినీతిని అరికట్టేందుకు అనుసరించే పద్ధతులపై ఇరుపక్షాలకు ఉన్న భిన్నాభిప్రాయాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మన్మోహన్ సూచించారు. రాజ్యాంగబద్దంగా అన్ని కోణాల నుంచి పటిష్టమైన లోక్‌పాల్ చట్టాన్ని తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నద్నారు. ఈ విషయంలో పౌరసమాజం అందజేసే సలహాలను గణనీయస్థాయిలో తీసుకునేందుకు ప్రభుత్వానికి అంగీకారమేనన్నారు. ఎవ్వరితోనైనా ఈ విషయమై చర్చలు జరుపుతామని ప్రధాని చెప్పారు. అయితే పార్లమెంట్ సార్వభౌమాధికారం, రాజ్యాంగపరమైన బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని చట్టాన్ని చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సభ్యులను ఎన్నుకునే ప్రజల అభిమతానికి అనుగుణంగా లోక్‌పాల్ చట్టాన్ని తయారు చేస్తామన్నారు. అన్నా హజారే సలహాలు తమకు అవసరమని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. క్షీణిస్తున్న హజారే అరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రయోజనాల దృష్టా మీరు సంపూర్ణ ఆరోగ్యంతోఉంటూ సలహాలు ఇవ్వాలన్నారు. లోక్‌పాల్ బిల్లు ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉంది. స్టాండింగ్ కమిటీకి ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పొచ్చు. మీరు కూడా మీ సలహాలు, అభిప్రాయాలు క్లాజుల వారీగా స్టాండింగ్ కమిటీకి పంపించిన పక్షంలో పరిశీలించి వాటిని కూడా బిల్లులో పొందుపరుస్తామని మన్మోహన్ హామీ ఇచ్చారు. దేశానికి సేవ, అవినీతిని అరికట్టే విషయంలో మీ, మా అభిప్రాయాలకు ఎలాంటి తేడా లేదని ప్రధాని లేఖలో వ్యాఖ్యానించారు. నియమాలు అనుమతిస్తే జనలోక్‌పాల్ బిల్లును ప్రభుత్వ లోకపాల్ బిల్లును పరిశీలిస్తున్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపించే విషయం పరిశీలించాలని లోకసభ స్పీకర్ మీరాకుమార్‌ను కోరుతానని మన్మోహన్ సింగ్ తమ లేఖలో హామీ ఇచ్చారు. లోకపాల్ బిల్లును వీలున్నంత త్వరగా పరిశీలించి పార్లమెంటుకు పంపించాల్సిందిగా స్టాండింగ్ కమిటీని కోరతామని కూడా హజారేకు రాసిన లేఖలో మన్మోహన్ సూచించారు.
రాత పూర్వక హామీ
యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం జనలోక్‌పాల్ బిల్లు విషయంలో లిఖితపూర్వక హామీ ఇస్తేనే అన్నా హజారే నిరాహార దీక్ష విరమించుకునే విషయం పరిశీలిస్తారని పౌరసమాజం నాయకులు అరవింద్ కేజ్రివాల్, ప్రశాంత్ భూషణ్, కిరణ్‌బేడీ స్పష్టం చేశారు. ప్రణబ్ ముఖర్జీతో చర్చల సమయంలో ముగ్గురు నాయకులు ఈ విషయం చెప్పారు. ప్రభుత్వం గతంలో లోక్‌పాల్ బిల్లు తయారు చేసేందుకు చర్చలు జరిపిన సమయంలో తమను మోసం చేసిందని అన్నా హజారే భావిస్తున్నారని కూడా ప్రణబ్ ముఖర్జీతో చెప్పారు. యుపిఏ సంకీర్ణ సర్కారు స్పష్టమైన హామీని లిఖిత పూర్వకంగా ఇస్తేనే హజారే దీక్ష విరమించుకుంటారని నొక్కిచెప్పారు.