కనిమోళి సంచలన ప్రకటన * స్పెక్ట్రమ్ స్కామ్‌లో సాక్షిగా నిలబెడతానని బెదిరింపు * లైసెన్స్‌ల వేలం వద్దన్నది మన్మోహన్, చిదంబరమే
న్యూఢిల్లీ, ఆగస్టు 23: టెలికాం కుంభకోణంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కూడా కోర్టుకు లాగుతానని 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో అరెస్టయిన డిఎంకె ఎంపి, కరుణానిధి కుమార్తె కనిమోళి మంగళవారం బెదిరించారు. ‘ఒకవేళ నాకు వ్యతిరేకంగా విచారణ కొనసాగిన పక్షంలో ప్రధానిని సాక్షిగా పిలిపించాలని కోరుతాను’ అని తన లాయరు సుశీల్ కుమార్ ద్వారా సిబిఐ ప్రత్యేక జడ్జి ఒపి సైని ముందు ఆమె వాదించారు. టెలికాం మాజీ మంత్రి ఎ రాజా సహా 2జి స్పెక్ట్రమ్ కేసులో నిందితులందరూ కుంభకోణంతో ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరానికి సంబంధం ఉందని ఆరోపించిన విషయం తెలిసిందే. 2జి స్పెక్ట్రమ్ కోసం లైసెన్సులు జారీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టమూ రాలేదని ప్రధానమంత్రి పార్లమెంటులో స్పష్టంగా ప్రకటించారని కూడా కనిమోళి వాదించారు. టెలికాం మాజీ మంత్రి ఎ రాజాసహా కేసులో నిందితుల చర్యల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వచ్చిందనేది సిబిఐ వాదన అని కనిమోళి లాయరు పేర్కొంటూ, నష్టం లేదని ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడే చీటింగ్ ఆరోపణలు కూడా పోయినట్లేనని అన్నారు. అంతేకాదు 2జి స్పెక్ట్రమ్‌ను వేలం వేయక పోవడంవల్ల ఎలాంటి నష్టమూ జరగలేదని ప్రధానమంత్రి, అప్పటి ఆర్థిక మంత్రి (పి చిదంబరం), ప్రస్తుత టెలికాం మంత్రి (కపిల్ సిబల్) అందరూ పార్లమెంటుకు, అంటే దేశ ప్రజలకు చెప్పారని సుశీల్ కుమార్ వాదించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రభుత్వానికి లక్షా 76వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కాగ్ నివేదికను కనిమోళి న్యాయవాది ఎద్దేవా చేశారు. ‘కాగ్ నివేదికను 2010 నవంబర్ 16న పార్లమెంటు ముందుంచారు. నివేదికను ఇంకా ఆమోదించలేదు. దాన్ని ఆమోదిస్తారో లేదో కూడా తెలియదు’ అని అన్నారు. అలాగే స్పెక్ట్రమ్‌ను వేలం వేయకపోవడం వల్ల 30,984 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్టు సిబిఐ అంచనా వేయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. లైసెన్స్‌లను వేలం వేయడం వల్ల ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చి ఉండేదని సిబిఐ చార్జిషీటులో చేసిన వాదనకు ఎలాంటి ఆధారమూ లేదని కూడా సుశీల్ కుమార్ వాదించారు.